Thursday, 9 June 2016

Weaving the situation in the country welfare laws దేశంలో చేనేత పరిస్థితి - సంక్షేమ చట్టాలు

దేశంలో చేనేత పరిస్థితి - సంక్షేమ చట్టాలు
కొత్త పెళ్లి కూతురు మెరిసిపోయేది జరీ చీరలోనే. ఆ మెరుపు మన సంస్కృతి, వారసత్వానిది. దానిని సృష్టించింది మన చేనేతే. ఈ హస్తకళా నైపుణ్యం రుగ్వేద కాలం మొదలు మహాభారత, రామాయణాల మీదుగా ఈనాటి వరకు అందరి మన్ననలు అందుకుంటూ వస్తున్నది. మొహంజొదారో, హరప్పా తవ్వకాల్లో కనిపించిన మన పూర్వీకుల వస్తువుల్లో చేతితో నేసిన వస్త్రం, ఎముకల నుంచి చేసిన సూదులు, కదుర్లు (నేత పనిముట్లు) కూడా లభించాయి.

-ప్రపంచ చేనేత తయారీలో 85 శాతం వాటా భారతదేశానిదే. అందులోనూ దక్షిణాది రాష్ర్టాల్లో చేనేతరంగంపై ఎక్కువమంది ఆధారపడి ఉండటం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని అనేక జిల్లాల్లో చేనేతరంగం ప్రధాన జీవనాధారంగా కొనసాగుతుండటం ఒక అంశం అయితే కాలానుగుణంగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల చేనేతరంగం సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం మరో కీలక అంశం.

chenetha1
ఉపాధికి ఆపద
రాష్ట్రంలో వ్యవసాయం తరువాత రెండో ప్రధాన ఉపాధి కల్పన రంగమైన చేనేత పరిశ్రమ నేడు సంక్షోభానికి గురవుతున్నది. పారిశ్రామీకరణ, ఆధునీకరణ, ప్రపంచీకరణ ప్రభావం వల్ల చేతి మగ్గాలు కనుమరుగై నేతన్న జీవనం దుర్భరంగా మారింది.
-చేతి మగ్గంపై నేసిన ప్రతి వస్ర్తాన్ని మరమగ్గంపై సులభంగా తయారుచేస్తున్నారు. ఈ పోటీని సవాలుగా తీసుకున్న చేనేత పరిశ్రమ వారి సామర్థ్యాన్ని, వేగాన్ని కచ్చితత్వాన్ని పెంచుకోగలిగారు. అయితే ఇది కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యింది. దీనివల్ల మిగిలినవారు మరింత దుర్భరస్థితి అనుభవిస్తున్నారు.
-బ్రిటిష్ వలస పాలనాకాలం నుంచి నేటి వరకు చేనేత వ్యవస్థకు అందాల్సిన చేయూత పూర్తిస్థాయిలో అందకపోవడంతో నేత కార్మికుల జీవనపరిస్థితిలో పెద్దగా మార్పు కనపడలేదు. ప్రపంచీకరణ ప్రభావం వల్ల స్వేచ్ఛగా వస్త్ర ఉత్పత్తి చేసే సగటు చేనేత కుటుంబం ప్రస్తుతం దినసరి కూలీలుగా కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నది.

-1955లో ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలో జరిగిన మార్పు లు చేనేత పరిశ్రమలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీనివల్ల దేశాల మధ్య ఎగుమతి, దిగుమతికి సంబంధించిన నిబంధనలు పూర్తిగా సరళీకరించారు. స్వేచ్ఛా వాణిజ్యం (FREE TRADE) చేనేతను కుంగదీసింది. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, వాణిజ్య విధానాల ప్రభావంతో దేశంలోని 2.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తున్న చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయింది.
-దేశంలోని మొత్తం చేనేత కార్మికుల్లో 61 శాతం మంది చేనేతపై ఆధారపడగా, 34 శాతం మంది మాస్టర్ వీవర్స్ (చేనేత నిపుణులు) వద్ద పనిచేసే కార్మికులు, మిగతా 5 శాతం మంది మాత్రమే ఆధునిక చేనేత పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.

chenetha2
కారణాలు
-చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి అనేక కారణాలున్నాయి.
1)ఆర్థిక సంస్కరణల (1991) ప్రభావంతో పారిశ్రామీకరణ వేగవంతమైన అన్ని రంగాల్లో యాంత్రీకరణ జరిగినట్లే చేనేతరంగంలో కూడా జరిగింది. ఫలితంగా చేతితో నేసే వస్ర్తాలకు డిమాండ్ తగ్గింది.
2)తక్కువ ధరకు కృత్రిమ దారాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో వీటితో తయారుచేసిన వస్ర్తాలకు ధర తక్కువగా ఉండి చేనేత వస్ర్తాలకు ఆదరణ కరువైంది.
3)ముడి పదార్థాలు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాల్సిన మధ్యవర్తులు తమ స్వలాభం కోసం మగ్గాలు, పనిముట్లు, ముడిపదార్థాలను రుణాలకు అందించి ఒప్పందాలను కుదుర్చుకోవడం.
4)మార్కెట్ అవసరాలకు తగినట్లుగా చేనేత ఉత్పత్తులు ఉండకపోవడం
5)పత్తి, నూలు ధరలు పెరగడంతో అనివార్యంగానే చేనేత వస్ర్తాల ధరలు అధికవడం, వీటితో పోలిస్తే యంత్రాలద్వారా తయారైన వస్ర్తాల ధర తక్కువగా ఉండటంతో సహజంగానే చేనేత వస్ర్తాలకు డిమాండ్ తగ్గింది.

6)చేనేత ఉత్పత్తుల్లో అధిక భాగం అమ్ముడుపోకపోవడం
7)ఆర్థిక సహాయం సరిగా లేకపోవడం
8)చేనేత సహకార సంఘాలు బలహీనపడటం
9)ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం
10)చేనేత అభివృద్ధికిగాను ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు సమర్థమంతంగా లేకపోవడం

ప్రమాదకరంగా పర్యవసానాలు
-జాతి ఔన్నత్యానికి, గ్రామీణ చేతివృత్తుల నైపుణ్యాలకు ప్రతిబింబంగా ఉండే చేనేతరంగం నేడు చేనేత కార్మికుల జీవనాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నది.
-చేనేతరంగం సంక్షోభం చేనేత కార్మికుల ఆత్మహత్యల రూపంలో బయటపడుతుంది. చేనేతరంగం దెబ్బతినడంతో నేతన్నలు వలసబాట పట్టారు (తెలంగాణ మొదటి వలసలు). నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి సూరత్, షోలాపూర్, ముంబైలకు ఈ వలసలు ఎక్కువగా జరిగాయి. కొంతకాలంగా చేనేత కార్మికుల ఆత్మహత్యల సంఖ్య పెరగడాన్ని చూస్తే భవిష్యత్‌లో చేనేతరంగం మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉందన్న హెచ్చరిక కనిపిస్తుంది.

చేనేత అభివృద్ధికి కృషి
చేనేత కార్మికుల సంఖ్య ఏటా 7 శాతం చొప్పున తగ్గుతున్నది. ఇదే నిష్పత్తిలో చేతిమగ్గాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. నవతరాన్ని ఈ రంగం ఆకర్షించలేకపోతున్నది. ఇది ఇలాగే కొనసాగితే అంతరించిపోతున్న పరిశ్రమల జాబితాలో చేనేత పరిశ్రమ కూడా చేరే ప్రమాదముంది. ఇతర రంగాల్లో కార్మికుల సగటు వేతనం నెలకు రూ. 4,500 ఉండగా, చేనేత పనివారికి రూ. 3,400 మాత్రమే ఉంది.

చేనేతకు ప్రభుత్వం చేయూత
-మరమగ్గాల నుంచి ప్రభుత్వం చేనేతను రక్షించడానికి 1985లో చేనేత చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని అనుసరించి 11 రకాల వస్తువులను చేనేతరంగానికి కేటాయించి వాటి ఉత్పత్తి చేనేతరంగమే చేయాలి. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మరమగ్గాలకు జరిమానా విధిస్తారు.
-జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వం నేత కార్మికులకు సబ్సిడీ ధరపై నూలును అందిస్తుంది. దీన్ని తగిన మోతాదుకు తగిన ధరకు లభించేలా చూడటానికి 1955 నిత్యావసర సరుకుల చట్టం ఏర్పాటు చేశారు.
-దీని ప్రకారం స్పిన్నింగ్ మిల్లులు తయారుచేసే హంక్‌యా ర్ రకం నూలులో నిర్దిష్ట శాతం చేనేతరంగానికి కేటాయించాలి.

-2011లో ప్రభుత్వం చేనేత కార్మికులు, సంఘాల రుణాలు రద్దుచేస్తూ రూ. 3 వేల కోట్ల మేర ప్యాకేజీలు ప్రకటించింది. పాత బకాయిలు తీరితే కొత్త రుణాలు పొందే అర్హత ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశం.
-చేనేత రంగంలో కూడా యాంత్రీకరణ పెంచితే పనివారి సామర్థ్యం, ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత కూడా పెరుగుతుందని భావించి 1773లో జాన్ కే రూపొందించిన ఫ్లయింగ్ షటిల్ పద్ధతిని ప్రవేశపెట్టింది.
-దీనివల్ల వస్త్రం అంచును ఎక్కువ అందంగా, కాళ్లు తుడుచుకునే పట్టాలు, చున్నీ వంటివి నేయడానికి రెండు పొరల పద్ధతిని అవలంబించారు.
-దీనివల్ల చిన్నచిన్న చేనేత మగ్గాలవారు వారి శారీరక శ్రమను తగ్గించుకోడానికి ఉత్పత్తిని పెంచడానికి, తమ ఉత్పత్తులను స్థానిక అవసరాలకు మాత్రమే కాకుండా వాణిజ్య అవసరాల దృష్ట్యా యాంత్రీకరించుకున్నారు.


-చేనేతరంగంలో పరిశోధనలను ప్రోత్సహించాలి. ఇందులోభాగంగా చేనేత మగ్గంపై వస్త్రం నేసే ప్రక్రియ ముందు, తరువాత, ముడిసరుకు శుద్ధి, నేసిన వస్త్రం తుది మెరుగుల కోసం పరిశోధనలు ముమ్మరం చేయాలి.
-చేనేత వస్ర్తాలను ఉత్పత్తి చేయడం ఒక ఎత్తైతే విజయవంతంగా మార్కెటింగ్ చేయడం మరొక ఎత్తు. మార్కెటింగ్‌లో ప్రభుత్వాలు చేనేతరంగానికి అండగా ఉండాలి.
-ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలన్నది చేనేతరంగం డిమాండ్. ప్రభుత్వం దీన్ని పరిశీలించాలి.
-బడి పిల్లలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉచితంగా యూనిఫాం వంటివి ఇప్పటికే అమల్లో ఉన్నాయి. నిర్దిష్ట లక్ష్యం మేరకు దుస్తులు నేసి చేనేత కార్మికులకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలి.
-చేనేతకు ఉన్న విశిష్టత దెబ్బతినకుండా దానితో ముడిపడి ఉన్న భావోద్వేగాల బంధాన్ని చెదిరిపోనీయకుండా ఉత్పత్తి స్థావరాలను విస్తరింపచేస్తూ ప్రక్రియను ఆధునీకరించడానికి పరిశోధకులు, శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలి.

0 comments:

Post a Comment