Thursday, 7 April 2016

Development disparities అభివృద్ధి- అసమానతలు

వాణిజ్య బ్యాంకులు రుణాలు
-భారతదేశంలో బ్యాంకు రుణాలను కొన్ని రాష్ర్టాలే అధికంగా కలిగి ఉన్నాయి. చాలా రాష్ర్టాలకు రుణం అందకపోవడంతో అవి వెనుకబాటుకు గురవుతున్నాయి. 2014లో బ్యాంకులు గరిష్టంగా మహారాష్ట్రకు రూ. 1,82,11,857 మిలియన్లు అప్పుగా ఇవ్వగా, బీహార్‌కు రూ. 6,24,617 మిలియన్లు మాత్రమే రుణంగా ఇచ్చాయి.

రాష్ర్టాలు-ఎఫ్‌డీఐలు
రాష్ర్టాలు ఆకర్షించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కూడా ప్రాంతీయ అసమానతలు ఆధారపడి ఉంటాయి. 2012ను గమనిస్తే భారత్‌లోకి మారిషస్ (34 శాతం), సింగపూర్ (15 శాతం), యునైటెడ్ కింగ్‌డమ్ (9 శాతం), జపాన్ (7 శాతం), నెదర్లాండ్స్, అమెరికా (6 శాతం)ల నుంచి అత్యధికంగా ఎఫ్‌డీఐలు వచ్చాయి. అదేవిధంగా 2015లో అత్యధిక ఎఫ్‌డీఐలను సేవారంగం (17 శాతం), నిర్మాణ రంగం (9 శాతం), కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ (7 శాతం), టెలికాం రంగం (9 శాతం), ఆటోమొబైల్ (5 శాతం) ఆకర్షించాయి.
-2015లో ముంబై (29 శాతం), ఢిల్లీ (21 శాతం), బెంగళూరు (7 శాతం), చెన్నై (7 శాతం), అహ్మదాబాద్ (5 శాతం), హైదరాబాద్ (4 శాతం)లో అత్యధిక ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి.
-అదేవిధంగా మహారాష్ట్రలో 1047 విదేశీ కంపెనీలు, కర్ణాటకలో 374, హర్యానాలో 289, తమిళనాడులో 265, ఒడిశాలో 11 విదేశీ కంపెనీలు నమోదయ్యాయి. ఇవికూడా అసమానతలకు దారితీస్తున్నాయి.
-2000-14 మధ్య కాలంలో దేశంలో ఎఫ్‌డీఐలను అత్యధికంగా మహారాష్ట్ర (30 శాతం), ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలు ఆకర్షించాయి. మొత్తం 236 అమెరికన్ బిలియన్ డాలర్లలో మహారాష్ట్ర ఒక్కటే 70 అమెరికా బిలియన్ డాలర్లను ఆకర్షించింది.

line
11వ ప్రణాళికలో రాష్ర్టాల వృద్ధిరేటు
11వ ప్రణాళికా కాలంలో దేశ వృద్ధి రేటు 8 శాతంగా నమోదయ్యింది. అయితే గోవాలో 12.1 శాతం, గుజరాత్‌లో 11.2 శాతం, హర్యానా 11 శాతం, కర్ణాటక 11.2 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9.5 శాతం వృద్ధిని కైవసం చేసుకోగా, బీహార్ 7.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసుకుంది. అభివృద్ధి చెందిన రాష్ర్టాలు 9.6 శాతం వృద్ధిరేటును కలిగి ఉండగా, వెనుకబడిన రాష్ర్టాలు 7.3 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి.

స్థూల రాష్ర్టోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా
ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ర్టాల్లో వ్యవసాయ రంగంవాటా తక్కువగా ఉంటే వెనుకబడిన రాష్ర్టాల్లో వ్యవసాయరంగ వాటా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో వ్యవసాయరంగం వాటా 27.5 శాతం నమోదుకాగా, మహారాష్ట్రలో 6.01 శాతమే ఉంది. అదేవిధంగా తమిళనాడులో 6.26 శాతం, తెలంగాణలో 14.81 శాతం ఉన్నట్లు 2014 గణాంకాలు తెలుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఆదాయంలో వ్యవసాయరంగం వాటా 20.18 శాతం ఉంది.

వ్యవసాయ ఉత్పాదకత
అధికంగా పంటను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న రాష్ర్టాలు ధనికంగా ఉండగా, ఉత్పత్తి తక్కువగా ఉన్న రాష్ర్టాలు వెనుకబడి ఉన్నాయి. 2014 గణాంకాల ప్రకారం దేశ ఉత్పాదకత కిలో/హెక్టార్‌లో చూస్తే దేశంలో 2129గా నమోదయ్యింది. అయితే పంజాబ్‌లో 3890 కిలో/హెక్టార్‌గా, హర్యానాలో 3689 కిలో/హెక్టార్‌గా, ఒడిశా 1592 కిలో/హెక్టార్, ఛత్తీస్‌గఢ్‌లో 1504 కిలో/హెక్టార్ నమోదయ్యింది.

ఎరువుల వినియోగం
ధనిక రాష్ర్టాలు అధికంగా ఎరువుల వినియోగం చేస్తుండగా, పేద రాష్ర్టాలు తక్కువగా ఉపయోగిస్తున్నాయి. దేశంలో ఎన్‌పీకే ఎరువుల వినియోగం 125.39 కిలో/హెక్టార్ ఉండగా, ధనిక రాష్ర్టాల్లో ఉదాహరణకు పంజాబ్ 216 కిలో/హెక్టార్, హర్యానాలో 179.98 కిలో/హెక్టార్, తెలంగాణలో 226.72 కిలో/హెక్టార్ వినియోగం జరుగుతున్నది. మధ్యప్రదేశ్‌లో 84 కిలో/హెక్టార్, రాజస్థాన్‌లో 49 కిలో/హెక్టార్, జార్ఖండ్‌లో 82 కిలో/హెక్టార్, ఒడిశాలో 98 కిలో/హెక్టార్‌లుగా 2013-14 ప్రకారం ఉపయోగిస్తున్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డులు-రాష్ర్టాలు
2014 గణాంకాల ప్రకారం వ్యవసాయ రుణంపొందే అవకాశం కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)లు ఇస్తాయి. అయితే ఈ అవకాశం పెద్ద రాష్ర్టాలే అధికంగా పొందుతున్నాయి. ఇదికూడా అసమానతలకు గురిచేస్తున్నది. 2014లో దేశంలో 10,10,94,187 కిసాన్ కార్డులు విడుదల చేశారు. ఇందులో వాణిజ్య బ్యాంకులు 5,47,49,373 విడుదల చేయగా, సహకార బ్యాంకులు 3,57,65,467 విడుదల చేశాయి. గ్రామీణ బ్యాంకులు 1,05,79,347 విడుదల చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1,66,86,592, ఉత్తరప్రదేశ్‌లో 1,56,11,421 కార్డులు, ఒడిశా 52,18,447, బీహార్ 42,97,275 కార్డులున్నాయి.

రాష్ర్టాల్లో సగటు కమతం
2010-11లో సగటు కమతం 1.16 హెక్టార్లుగా నమోదయ్యింది. హర్యానాలో 2.25, పంజాబ్‌లో 3.77 హెక్టార్లు ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1.08 హెక్టార్లు, ఒడిశాలో 1.04 హెక్టార్లు నమోదయ్యింది.

వ్యవసాయ రుణాలు
2014 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 51.9 శాతం రైతాంగం రుణ ఊబిలో ఉన్నారు. అయితే తెలంగాణలో 89.1 శాతం, ఒడిశాలో 57 శాతం రైతులు, ఆంధ్రప్రదేశ్‌లో 92 శాతం రైతులు అప్పులపాలయ్యారు.

తలసరి విద్యుత్ వినియోగం
దేశ తలసరి విద్యుత్ వినియోగం 1010 కిలోవాట్లు కాగా, కొన్ని రాష్ర్టాల్లో అధిక వినియోగం ఉండి ఆర్థికంగా ముందంజలో ఉన్నాయి. ఉదాహరణకు పంజాబ్ 1663 కిలోవాట్లు, గుజరాత్ 1558 కిలోవాట్లు, హర్యానా 1491 కిలోవాట్లు, ఉత్తరప్రదేశ్ 386 కిలోవాట్ల వినియోగం కలిగి ఉన్నాయి. వీటినిబట్టి అసమానతలను అంచనావెయ్యవచ్చు.

పన్ను ఆదాయం
-కొన్ని రాష్ర్టాల్లో పన్ను ఆదాయం ఎక్కువగా ఉండి ముందంజలో ఉన్నాయి.
-2014-15లో అధిక పన్ను ఆదాయం మహారాష్ట్ర (రూ. 4518 బిలియన్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 3234 బిలియన్లు) రాష్ర్టాలు కలిగి ఉన్నాయి.

దేశ ఆదాయంలో రాష్ర్టాల వాటా
-2010లో దేశ జీడీపీలో మహారాష్ట్ర దాదాపు 16.7 శాతం ఆదాయం, గుజరాత్ 8.2 శాతం, తమిళనాడు 7.8 శాతం వాటా కలిగి ఉన్నాయి. కానీ బీహార్ 3 శాతం, ఒడిశా 2.7 శాతం, మధ్యప్రదేశ్ 2.9 శాతం వాటా మాత్రమే కలిగి ఉన్నాయి.
-అయితే గణాంకాల ప్రకారం BIMARU రాష్ర్టాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లు 2010లో దేశ జీడీపీలో 18.7 శాతం వాటా కలిగి ఉండగా, 2020లో వీటి ఆదాయం జీడీపీలో 26.4 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.

ప్రత్యేక ఆర్థిక మండళ్లు-అసమానతలు
-దేశంలో 412 ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్)ఉన్నాయి. ఇందులో 204 పని చేస్తున్నాయి. వీటిలో అత్యధిక సెజ్‌లను కొన్ని రాష్ర్టాలే కలిగి ఉన్నాయి. 2015, మార్చి 31వరకు పనిచేస్తున్న సెజ్‌లు
1. తమిళనాడు- 35
2. తెలంగాణ- 25
3. కర్ణాటక- 24
4. మహారాష్ట్ర- 24
5. ఆంధ్రప్రదేశ్- 18
6. గుజరాత్- 17
-మధ్యప్రదేశ్‌లో రెండు సెజ్‌లు పనిచేస్తున్నాయి.
-తెలంగాణలో మొత్తం 67 సెజ్‌లు ఉండగా, అందులో 25 మాత్రమే OPERATIONలో ఉన్నాయి.
-సెజ్‌లు 100 శాతం వస్తువులను ఎగుమతి చేయాలి.

ప్రాంతీయ సమానతలు-లీడ్ బ్యాంక్ పథకం
-నారీమన్ కమిటీ సూచనలతో అన్ని ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి 1969లో లీడ్ బ్యాంక్ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ స్కీమ్ ఇప్పటికీ అమల్లో ఉంది.

ప్రాంతీయ సమానత్వం- హర్ష్‌మన్, సింగర్
-హర్ష్‌మన్ ప్రకారం ప్రాంతీయ అసమానతలు తొలగాలంటే ఉత్పత్తి కంటే ముందు (DIRECTIVE PRODUCTIVE ACTIVITIES) అవస్థాపనా సౌకర్యాల (SOCIAL OVERBEAD CAPITAL)ను అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, రైల్, ఎలక్ట్రిసిటీ, టెలికం మొదలైన అనేక అంశాలను అభివృద్ధి చేసిన తర్వాత ఆ ప్రాంతంలోని భూముల విలువ పెరుగుతుంది.
-అదేవిధంగా హర్ష్‌మన్ ప్రకారం ఉత్పత్తి ప్రక్రియలో ముందు అనుబంధాలు (FORWARD LINKAGE), వెనుక అనుబంధాలను (బ్యాక్‌వర్డ్ లింకేజ్) అభివృద్ధి చేసినట్లయితే.. ఉత్పత్తి ప్రక్రియ విస్తరించబడిన ప్రాంతాల మధ్య అసమానతలను నిర్మూలించవచ్చు.

ప్రాంతీయ అసమానతలు - డా. గాడ్గిల్
-1962లో డాక్టర్ గాడ్గిల్ ప్రాంత దృక్పథాన్ని ప్రారంభించారు. దానిప్రకారం దేశంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అలాంటి వ్యూహాన్ని ఏరియా అప్రోచ్ అంటారు.

రవాణా సబ్సిడీ పథకం
-వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి 50 నుంచి 90 శాతం వరకు రవాణాలో సబ్సిడీ ఇస్తారు. దీన్ని 1971లో ప్రారంభించారు. ముడి పదార్థానికి, వారు ఉత్పత్తి చేసిన వస్తువులకు కూడా రవాణాలో సబ్సిడీ ఇస్తారు.

వృద్ధి కేంద్ర పథకం
-వెనుకబడిన ప్రాంతాల్లో అవస్థాపన కల్పించాలని 1988లో గ్రోత్ సెంటర్ స్కీమ్ (GDS) ను ప్రారంభించారు. ప్రతి కేంద్రానికి దాదాపు రూ. 30 కోట్లు కేటాయించి అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తారు.

గ్రామీణ బ్యాంకులు
-దేశంలో భౌగోళిక పరిస్థితుల వల్లనో, జనసాంద్రత అధికంగా ఉండటం, మానవ వనరుల కొరత, సహజ వనరుల వల్లనో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి. అలాంటి ప్రాంతాల అభివృద్ధి కోసం SARAYU సూచనల మేరకు 1975లో గ్రామీణ బ్యాంకులను ప్రారంభించారు.

ప్రాంతీయ అసమానత్వం - దత్ కమిటీ
-మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు దాదాపు 60 శాతం పరిశ్రమలకు కావాల్సిన లైసెన్సులు పొందాయంటే పారిశ్రామిక కేంద్రీకరణ జరిగిందని దత్ కమిటీ పేర్కొంది. 1951లో తీసుకొచ్చిన పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం (IRDA) సరిగా అమలు జరగలేదని పేర్కొంది.

ప్రాంతీయ అసమానత్వం - P.C. మహలనోబిస్
-1969లో ఆర్థిక శక్తి కేంద్రీకరణను నిర్మూలించడానికి ప్రభుత్వం ఏకస్వామ్యాల పరిశీలన నియంత్రణ కమిషన్ (MRTPC)ని ప్రారంభించింది. పెద్దపెద్ద పారిశ్రామిక కుటుంబాల నియంత్రణ కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
-1970లో MRTPC కి చట్టబద్ధత కోసం MRTPA (మోనోపాలిస్ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్)ను తీసుకొచ్చారు.

సమగ్ర ప్రాంత ప్రణాళిక
-2012లో 78 వెనుకబడిన జిల్లాల కోసం IAP (ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్)ను ప్రారంభించారు. ప్రతి జిల్లాకు రూ. 30 కోట్లు కేటాయించి అవస్థాపన అభివృద్ధి చేస్తారు.

్రప్రత్యేక కేటగిరీ రాష్ర్టాల పథకం
-ప్రాంతాల మధ్య అసమానతలను నిర్మూలించడానికి ప్రత్యేక కేటగిరీ రాష్ర్టాల పథకాన్ని పాటిస్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, తక్కువ జనసాంద్రతగల రాష్ర్టాలు, అవస్థాపన తక్కువగా ఉన్న రాష్ర్టాలు, సరిహద్దు ప్రాంతాలు, ఆదాయ వనరులు తక్కువగా ఉన్న రాష్ర్టాలు ఈ తరహా కిందకు వస్తాయి. వీటికి 90 శాతం గ్రాంట్స్, 10 శాతం లోన్ ఇస్తారు.

S.C.S. హోదాగల రాష్ర్టాలు
1.ఈశాన్య రాష్ర్టాలు (7 రాష్ర్టాలు)
2.సిక్కిం
3.ఉత్తరాఖండ్
4.జమ్ముకశ్మీర్
5.హిమాచల్‌ప్రదేశ్
-1969లో డాక్టర్ గాడ్గిల్ ఫార్ములా ప్రకారం ఈ రాష్ర్టాలకు సౌకర్యాలు కల్పిస్తారు.

ప్రాంతీయ అసమానతలు - పాండే కమిటీ
-అన్ని రకాల పరిశ్రమల స్థాపన వెనుకబడిన ప్రాంతాల్లో జరిగినైట్లెతే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పాండే కమిటీ పేర్కొంది. 1988లో ఏర్పాటైన ఈ కమిటీ ప్రకారం వెనుకబడిన ప్రాంతాల్లో ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ స్కీమ్‌ను అమలు చేయాలని పేర్కొన్నారు. శివరామన్ అధ్యక్షతన NCDBA (నేషనల్ కమిటీ ఆన్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ ఏరియాస్) వెనుకబడిన ప్రాంతాలపై అధ్యయనం చేసింది.

వాంఛూ కమిటీ
-1968లో వేసిన వాంఛూ కమిటీ ప్రకారం వెనుకబడిన ప్రాంతాల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. 1971లో TSS (ట్రాన్స్‌పోర్ట్ సబ్సిడీ స్కీమ్)ను కూడా ప్రారంభించారు.

అంతర్రాష్ట్ర - అసమానతలు
-రాష్ర్టాల మధ్యనే కాకుండా రాష్ట్రంలో కూడా అసమానతలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వెనుకబడిన ప్రాంతమని TDB (తెలంగాణ డెవలప్‌మెంట్ బోర్డ్)ని ఏర్పాటు చేశారు. అందుకే రాష్ట్రంలోని అసమానతలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. గుజరాత్‌లో సౌరాష్ట్ర, దుంగార్ విస్తార్, జమ్ముకశ్మీర్‌లో జమ్ము, మహారాష్ట్రలో విదర్భ, మరాఠ్‌వాడా, పశ్చిమబెంగాల్‌లో చోటా నాగపూర్ వెనుకబడి ఉన్నాయి.

రాష్ట్రీయ స్వయం వికాస్ యోజన
-వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, వెనుకబడిన రాష్ర్టాల్లో భౌతిక, సాంఘిక అవస్థాపనను పెంచడం మొదలైన లక్ష్యాలతో 2006-07 లో రాష్ట్రీయ స్వయం వికాస్ యోజనను ప్రారంభించారు. దీన్ని నేషనల్ ఈక్వల్ డెవలప్‌మెంట్ ప్లాన్ అంటారు. తర్వాత దీన్ని BRGF (బ్యాక్‌వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్) గా మార్చారు.
-ఈ ఫండ్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలు, పశువుల దవాఖానాల ఏర్పాటుతోపాటు, సాగునీరు, మార్కెట్ షెడ్లు మొదలైనవాటిని అభివృద్ధి చేస్తారు.
-2007 ఫిబ్రవరి 19న BRGF ను ప్రారంభించారు. ప్రణాళికా సంఘం ప్రారంభించిన BRGFలో RSVYని కలిపారు. ఈ ఫండ్ పరిధిలో 250 జిల్లాలున్నాయి. తెలంగాణలోగల BRGF జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్. దీని కింద జిల్లాకు ఏడాదికి రూ. 10 కోట్లు అవస్థాపన అభివృద్ధి కోసం కేటాయిస్తారు.

రఘురాం రాజన్ కమిటీ
-రఘురాం రాజన్ తలసరి ఆదాయం, పేదరికం, ఇతర అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని MDI (మల్టీ డైమెన్షియల్ ఇండెక్స్)ను అభివృద్ధి చేశారు.
-0-0.4 - రిలేటివ్‌లీ డెవలప్డ్
-0.4-0.6 - లెస్ డెవలప్డ్
-0.6- అంతకంటే ఎక్కువ - లీస్ట్ డెవలప్డ్
-లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్: ఒడిశా (0.768), బీహార్ (0.765), మధ్యప్రదేశ్ (0.759), ఛత్తీస్‌గఢ్ (0.752), జార్ఖండ్ (0.746), అరుణాచల్‌ప్రదేశ్ (0.729), అసోం (0.707), మేఘాలయ (0.693), ఉత్తరప్రదేశ్ (0.638), రాజస్థాన్ (0.626).
-లెస్ డెవలప్డ్ స్టేట్స్: మణిపూర్ (0.571), వెస్ట్‌బెంగాల్ (0.551), నాగాలాండ్ (0.546), ఆంధ్రప్రదేశ్ (0.521), జమ్ముకశ్మీర్ (0.504), మిజోరాం (0.495), గుజరాత్ (0.491), త్రిపుర (0.474), కర్ణాటక (0.453), సిక్కిం (0.430), హిమాచల్‌ప్రదేశ్ (0.404).

సాంఘిక అసమానతలు
-అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో ఆర్థిక అభివృద్ధి పరుగుకే అధిక ప్రాధాన్యత ఇచ్చి, సాంఘిక మార్పులకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సాంఘిక అసమానతలు ఉంటున్నాయి. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ, సాంఘికంగా అసమానతలు అధికంగా ఉన్నాయి. అందుకే ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యంగా జాతీయాదాయంలో ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉంటే, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం 130వ స్థానంలో ఉన్నాం.

బాలింత మరణాల రేటు
-బాలింత మరణాలు కూడా సాంఘిక అసమానతలకు కొలబద్దగా ఉంటాయి. 2010-12లో దేశంలో బాలింత మరణాలు 1,00,000కు 178 నమోదయ్యాయి.
-కనిష్టంగా కేరళలో 66 మాత్రమే ఉండగా, మహారాష్ట్రలో 87, తమిళనాడు 90, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 110 నమోదయ్యింది. 2012లో దేశంలో ఎంఎంఆర్ 100గా ఉండాలని ఆశించారు.
-బాలింత మరణాలు గరిష్టంగా అసోం (328), మధ్యప్రదేశ్ (292), ఒడిశా (235), రాజస్థాన్ (255)లో నమోదయ్యాయి.

జీవితకాలం
-దేశంలో 2002-06 మధ్యకాలంలో జీవితకాలం పురుషుల్లో 62.6 ఏండ్లుగా నమోదయ్యింది. అయితే గరిష్టంగా కేరళ 74, పంజాబ్‌లో 69.4, మహారాష్ట్రలో 67.2 ఏండ్లుగా, కనిష్టంగా మధ్యప్రదేశ్‌లో 58, అసోం 58.9, ఒడిశాలో 59.6 ఏండ్లుగా నమోదయ్యింది.

వివాహ వయస్సు
-దేశంలో వివాహ వయస్సు (AGE AT EFFECTIVE MARRIAGE- AEM) 2005-09 సంబంధించి 20 ఏండ్లుగా నమోదయ్యింది. గరిష్టంగా కేరళలో 22.7, తమిళనాడులో 22.4 నమోదయితే రాజస్థాన్‌లో 19.8 ఏండ్లు మాత్రమే నమోదయ్యింది.

మొత్తం ప్రత్యుత్పత్తి రేటు
-2008-09లో మొత్తం ప్రత్యుత్పత్తి రేటు 2.6గా నమోదయ్యింది. అయితే బీహార్‌లో గరిష్టంగా 3.9గా నమోదవగా, తమిళనాడులో 1.7, ఆంధ్రప్రదేశ్‌లో 1.9, కర్ణాటక 2, కేరళ 1.7, మహారాష్ట్ర 1.9గా నమోదయ్యింది. 2012లో దేశంలో మొత్తం ప్రత్యుత్పత్తి రేటు 2.1 ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సురక్షిత నీరు
-ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 69 ROUND ప్రకారం దేశంలో 88.5 శాతం ప్రజలు తాగునీరు కలిగి ఉన్నారు. గరిష్టంగా పంజాబ్ 99.5 శాతం ఉండగా, మణిపూర్ 57 శాతం, జార్ఖండ్‌లో 64.4 శాతం, కేరళలో కనిష్టంగా 29.5 శాతం ఉంది.
-తాగు నీటికోసం ప్రభుత్వం వివిధ సందర్భాల్లో పథకాలు రూపొందించింది.
1. ఏఆర్‌డబ్ల్యూఎస్పీ - 1972-73 (సత్వర సాగునీటి పథకం)
2.ఆర్జీఎన్‌డీడబ్ల్యూఎన్ - 1991 (రాజీవ్‌గాంధీ జాతీయ గ్రామీణ తాగు నీటి పథకం)
3. స్వజలధార - 2002
4. ఎన్‌ఆర్డీడబ్ల్యూపీ - 2009 (జాతీయ తాగు నీటి పథకం)

జననాల రేటు
-1991లో జననాలు 1000కి దేశంలో 29.5 ఉంటే 2010లో 22.1కి తగ్గింది.
-సాధారణంగా జననాలు 10 లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. కానీ గరిష్టంగా ఉత్తరప్రదేశ్‌లో 28.3, బీహార్ 28.1, మధ్యప్రదేశ్ 27.3, రాజస్థాన్‌లో 26.7గా నమోదయ్యాయి. కేరళలో జననాల రేటు 14.8, గోవాలో 13.2గా ఉంది.

మరణాలరేటు
-1991లో దేశంలో మరణాల రేటు 1000కి 9.8 ఉండగా, 2010లో 7.2గా నమోదయ్యింది. గ్రామాల్లో 7.7గా, పట్టణాల్లో 5.8గా ఉంది.
-ఒడిశాలో గరిష్టంగా 8.6గా, మధ్యప్రదేశ్‌లో 8.3, అసోంలో 8.2, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 7.6గా నమోదయ్యింది.

కుటుంబ నియంత్రణ అందుబాటు
-కుటుంబ నియంత్రణ అందుబాటు గరిష్టంగా (2005-06) ఆంధ్రప్రదేశ్‌లో 95 శాతం ఉంటే, పంజాబ్‌లో 92.6 శాతం, గుజరాత్‌లో 91.8 శాతం, హర్యానాలో 91.7 శాతం అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
-దీనికి వ్యతిరేకంగా మేఘాలయలో 64.9 శాతం మాత్రమే కుటుంబ నియంత్రణ అందుబాటులో ఉండగా, నాగాలాండ్‌లో 73.3 శాతం, జార్ఖండ్‌లో 76.3 శాతం ఉంది.

ఆరోగ్యం ఖర్చు
-గ్రామాల్లో మొత్తం కుటుంబ వ్యయంలో 6.05 శాతం ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారు. రాష్ర్టాల్లో గరిష్టంగా కేరళలో 7.79 శాతం, మహారాష్ట్రలో 7.50 శాతం, పంజాబ్ 7.66 శాతం ఖర్చు చేస్తున్నారు.
-మొత్తం పట్టణాలను కుటుంబ వ్యయంతో చూస్తే 4.91 శాతం ఖర్చు చేస్తున్నది. అయితే గరిష్టంగా మహారాష్ట్ర 5.98 శాతం, కేరళ 7.15 శాతం ఖర్చు చేస్తుండగా, కనిష్టంగా బీహార్ 2.96 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4.13 శాతం ఖర్చు చేస్తున్నది.

స్త్రీ పురుష నిష్పత్తి
-సాంఘిక అభివృద్ధికి సూచిక ఈ స్త్రీ పురుష నిష్పత్తి. 2011లో దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి 943 నమోదయ్యింది. కానీ కనిష్టంగా హర్యానాలో 877 మాత్రమే ఉంది. పట్టణాల్లో 929 నమోదయ్యింది. గరిష్టంగా కేరళ 1084, తమిళనాడు 995, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 992, హర్యానా 877, జమ్ముకశ్మీర్ 883, పంజాబ్‌లో 893గా నమోదయ్యింది.

line1
అక్షరాస్యత
-దేశంలో అక్షరాస్యత సుమారుగా 72.99 శాతం నమోదయ్యింది. అయితే కొన్ని రాష్ర్టాలు ఎక్కువ అక్షరాస్యతను కలిగి ఉన్నాయి. బీహార్‌లో 63.82 శాతం, రాజస్థాన్‌లో 67.07 శాతం, జార్ఖండ్‌లో 67.63 శాతం నమోదయ్యింది. గరిష్టంగా కేరళ 93.91 శాతం, గోవా 87.40 శాతం, మహారాష్ట్ర 82.91 శాతంగా ఉంది.

తక్కువ బరువుగల పిల్లలు
-దేశంలో తక్కువ బరువుగల పిల్లలు 2013-14లో 29.4 శాతం ఉండగా, మధ్యప్రదేశ్‌లో 38 శాతం, బీహార్‌లో 39 శాతం ఉన్నారు. అదేవిధంగా దేశంలో పెరుగుదల లేని పిల్లలు 38 శాతం నమోదవగా, మేఘాలయలో 43 శాతంగా నమోదయ్యింది.

0 comments:

Post a Comment